​తెలంగాణాలో బయో మెట్రిక్ లేకుండానే రేషన్!

రేషన్ కోసం ఎవరూ కంగారు పడొద్దు. ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని  పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రేషన్ షాపులు నిరంతరాయంగా తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్న‌ట్లు ప్రకటించారు. 

తెలంగాణాలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పౌరసరఫరాల శాఖ భ‌రోసా ఇచ్చింది. 

వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే అంటే బయో మెట్రిక్ లేకుండానే రేషన్ తీసుకునే సదుపాయాన్ని తెలంగాణా ప్ర‌భుత్వం క‌ల్పించింది. రేషన్ బియ్యం తీసుకుంటేనే 1500 రూపాయల నగదు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు, మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా 1500 నగదును వారి ఖాతాల్లో జమ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేసింది. రేషన్ పంపిణీపై శుక్రవారం నాడు ముఖ్య‌మంత్రి  కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.