కేసీఆర్ ఆదేశం.. ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్

 

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని కేసీఆర్ చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డికి సీఎం అప్పగించారు. ఇంటర్‌ బోర్డు వివాదంపై ఇవాళ మంత్రి జగదీష్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కేసీఆర్‌ ఇవాళ సమీక్షించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. 'ఇంటర్మీడియట్‌తో పాటు ఎంసెట్ తదితర పరీక్షల విషయంలో కూడా ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి.' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.