ఏపీలో మరో కొత్త పథకం.. కాస్త భిన్నంగా

 

బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రోగులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత మందుల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం కింద నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపుల్లోనైనా రోగులు ఈ మందులు పొందే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదం లభించింది.

అదేవిధంగా గిరిజనుల వృద్ధాప్య ఫించన్ గురించి కూడా  ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇవ్వనున్నట్లు సర్కార్ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ ఉన్న 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రకటనతో గిరిజనులు ఆనందంలో మునిగితేలుతున్నారు.