సంచలన వార్త.. రాఫెల్ డీల్ తో అంబానీకి భారీ లబ్ది

 

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చే వార్తను ఫ్రెంచ్ పత్రిక ‘లే మాండే’ ప్రచురించింది. అనిల్‌ అంబానీకి చెందిన సంస్థకు 143.7మిలియన్‌ యూరోల పన్నును ఫ్రాన్స్‌ అధికారులు మాఫీ చేశారని ఫ్రెంచ్‌ పత్రిక సంచలన కథనం వెలువరించింది. ఫ్రాన్స్‌లో ఉండే అనిల్‌ అంబానీకి చెందిన ‘రిలయన్స్‌ అట్లాంటిక్‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌’ అనే సంస్థకు చెందిన పన్నును ఫ్రాన్స్‌ రద్దు చేసిందని ఈ పత్రిక వెల్లడించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయమై భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న కొన్ని నెలల తర్వాతే ఇది జరిగిందని  తెలిపింది. 2015 ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్‌ పర్యటకు వెళ్లారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌తో 36 రాఫెల్ జెట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని, తర్వాత అదే ఏడాది అక్టోబరులో అనిల్‌ అంబానీ కంపెనీకి ఫ్రాన్స్ పన్ను మాఫీ చేసిందని ఆ పత్రిక పేర్కొంది.

పత్రిక తెలిపిన వివరాల ప్రకారం...అనిల్‌ అంబానీ సంస్థ 2007-10 మధ్య 60మిలియన్‌ యూరోల పన్ను చెల్లించాల్సి ఉంది. ఫ్రాన్స్‌ అధికారులు ఈ విషయమై రిలయన్స్ అట్లాంటిక్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ సంస్థ 7.6మిలియన్‌ యూరోలు మాత్రమే చెల్లించగలమని అభ్యర్థించింది. అయితే దీనికి అధికారులు ఒప్పుకోలేదు. మొత్తం చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. తర్వాత మరోసారి 2010-12 మధ్యలో ఫ్రాన్స్‌ అధికారులు ఆ సంస్థపై విచారణ జరిపారు. అప్పుడు మరో 91మిలియన్‌ యూరోలు చెల్లించాలని లెక్కతేలింది. అప్పటికే చెల్లించాల్సిన పన్ను మొత్తం 151 మిలియన్‌ యూరోలకు చేరింది. రిలయన్స్‌ అట్లాంటిక్‌ ముందుగా చెప్పినట్లు 2015లో 7.6మిలియన్‌ యూరోలు పన్నుగా చెల్లించింది. మిగిలిన 143.7మిలియన్ యూరోలను అదే ఏడాది అక్టోబరులో ఫ్రాన్స్‌ రద్దు చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.

ఈ కథనంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పందించింది. ఇది 2008నాటి కేసు అని తెలిపింది. దీనిపై ఓ పరిష్కరాన్ని ఫ్రెంచ్ అధికారులతో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ పరిష్కారం వల్ల ఎటువంటి లబ్ధి జరగలేదని, పక్షపాతంతో వ్యవహరించలేదని వివరించింది. 2008-2012 మధ్య కాలంలో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్‌కు ఆపరేటింగ్ నష్టాలు 2.7 మిలియన్ యూరోలు అని, దీనికి ఫ్రెంచ్ పన్ను అధికారులు అత్యధిక పన్ను విధించారని, దీనిపై పరస్పర పరిష్కార ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.