కరోనా ఫోర్త్ వేవ్!.. ప్రభుత్వం అలర్ట్!!
Published on: Thu Mar 17, 2022 4:49PM
కరోనా మహమ్మారి ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌ల వల్ల ఎంతో మంది మరణించారు. తాజాగా కరోనా ఫోర్త్ వేవ్ వల్ల దేశానికి మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఆసియా దేశాల్లో కొత్త కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ తరుణంలో ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విజృభించే అవకాశం ఉందని.. దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. అలాగే కరోనా కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల.. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి... ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. కేసుల హాట్ స్పాట్‌లను ముందే గుర్తించేందుకు స్థానికంగా నిఘాను మరింత పెంచాలని కేంద్ర మంత్రి సూచించారట. ఈ సమావేశంలో కీలక సంస్థల ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారని తెలుస్తోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గరిష్టం నుంచి కనిష్టానికి తగ్గుముఖం పట్టిన తర్వాత కేంద్రం నిర్వహించిన తొలి సమీక్ష ఇదే కావడం గమనార్హం. మరోవైపు భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా ఊపందుకోంది.
భారత్‌లో కొత్త కేసులు 3 వేల లోపు పడిపోయిన సంగతి తెలిసిందే. జులై నాటికి భారత్‌లో నాలుగో వేవ్ మొదలవుతుందంటూ ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనా వేసి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసుల తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనాలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో మళ్లీ కరోనా కేసులు ఉధృతమవుతున్నాయి. దీంతో అక్కడ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ముప్పు పెరుగుతోండడంపై చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికా, ఇజ్రాయిల్ దేశాల్లో కొత్త కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది.


