నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష

దేశమంతటా ఎదురు చూసే తీర్పుకు తెర పడింది. బాధిత కుటుంబ పోరాటం ఫలించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈ నెల 22 న నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్షకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 22 వ తేదీన ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని పాటియాలా కోర్ట్ ఆదేశించింది. ఈ తీర్పు కోసం నిర్భయ తల్లిదండ్రులు.. బాధితురాలి తరపున ఉన్నవారందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

2012 డిసెంబర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికంగా జరిగిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో.. సుప్రీంకోర్టులో.. వరుసగా వాదనల తర్వాత వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకరు కోర్టు శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నలుగురు కూడా దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఉరిశిక్షను ఖాయం చేసింది. ఉరిశిక్ష అమలుకు సంబంధించి మరింత ఆలస్యం చేస్తున్నారని నిర్భయ తల్లిదండ్రులు మొదట పాటియాల కోర్టులో తమ పిటీషన్ వేయడం జరిగింది. అందులో జరిగిన రివ్యూ పిటిషన్లలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని.. అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. పునఃసమీక్షించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు కూడా రివ్యూ పిటిషన్ ని కొట్టిపారేసింది.