2 కాదు 4 డోసులు తీసుకున్న మహిళ.. అయినా, కొవిడ్ పాజిటివ్...
Published on: Thu Dec 30, 2021 1:44PM
కొవిడ్‌కు వ్యాక్సినే రక్ష. రెండు డోసులు కంపల్సరీ. అయినా, కొందరు అపోహలతో టీకా తీసుకునేందుకు జంకుతున్నారు. మరికొందరు ఒక్క డోసు తీసుకొని.. రెండో డోసును లైట్ తీసుకుంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆమాత్రమైనా రక్షణ ఉంటుంది. అయినా, కొవిడ్ సోకే ఛాన్సెస్ 25శాతం వరకూ ఉంటాయి. కానీ, ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ కేసు కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళ ఏకంగా నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆమెకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. నాలుగు డోసులు తీసుకోవడమే ఆసక్తికరమైతే.. అయినా, ఆమెకు కరోనా సోకడం మరింత సంచలనం.
మధ్యప్రదేశ్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు చేపట్టిన పరీక్షల్లో దుబాయ్‌కి చెందిన ఓ మహిళలకు పాజిటివ్ వచ్చింది. ‘ఇతర దేశాల్లో నాలుగు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న ఆ 30 ఏళ్ల మహిళ ఇటీవల ఇండోర్ వచ్చింది. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం నిర్వహించే కొవిడ్ పరీక్షలకు ఆమె నమూనాలు ఇచ్చింది. అందులో ఆ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చినట్లు ఆ మహిళ తెలిపారు. ప్రస్తుతం తీవ్ర లక్షణాలేమీ లేవు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం’ అని ఇండోర్ మెడికల్ అధికారులు చెప్పారు.
దుబాయ్ నుంచి 12 రోజుల క్రితమే ఆ మహిళ ఇండోర్ వచ్చారు. బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరై.. మళ్లీ తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు రాగా.. అక్కడ కొవిడ్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఆమె ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో సినోఫామ్, ఫైజర్‌కు చెందిన టీకాలను రెండు డోసుల చొప్పున తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అలా, మొత్తం నాలుగు డోసుల టీకా వేసుకున్నారు. అయినా, కొవిడ్ బారిన పడటంతో వైద్య అధికారులు ఉలిక్కిపడుతున్నారు.


