టీడీపీ మాజీ ఎంపీ శివ ప్రసాద్ కన్నుమూత

 

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్(68) కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో.. కొద్ది సేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు.

శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి. 1951 జూలై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు నాటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇక్కడే ప్రస్తుత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి ఆప్తులుగా ఉన్నారు. 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన శివప్రసాద్.. 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా శివప్రసాద్ గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. కాగా ఆయన సినీ నటుడిగా కూడా అందరికి సుపరిచితుడే. నటుడిగా ఖైదీ సినిమాతో ఆయన ప్రస్థానం మొదలైంది. తులసి, ఆటాడిస్తా, పిల్ల జమీందార్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. అంతేకాదు  కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. రాజకీయాల్లో కూడా శివ ప్రసాద్ చాలా భిన్నంగా ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ఆవరణలో వివిధ వేషాలతో తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.