TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్టు

Published on: Fri Sep 19, 2025 12:42PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.    తిరుపతిలోని ఆయన నివాసంలో మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఫైళ్ల దగ్ధం కేసులో ఆయనకు గతంలో ఇచ్చిన   బెయిలును సుప్రీం కోర్టు రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.  గత ఏడాది జులై 21న మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో మురళి నిందితుడు.  మురళీ 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పనిచేశారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో  అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధం కావడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాల ఆధారాలను చెరిపివేయాలన్న కుట్ర ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న కేసు కూడా నమోదైంది. దీంతో ఈ కార్యాలయంలో అంతకు ముందు పని చేసిన ఆర్డీవో మురళి సహా ఇతర అధికారులను అప్పట్లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో ప్రాథమిక ఆధారాల లభ్యం కావడంతో ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది.  

సీఐడీ దర్యాప్తులో ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్పట్లో పలువురిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు అయ్యాయి.   వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై అప్పట్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.  అప్పట్లో నిందితుల నివాసాలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భూములకు సంబధించిన ఫైళ్లు లభ్యమయ్యాయి.  దాదాపు కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేశారు. అప్పటి మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పది ఫైళ్లలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి.

అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులైన   మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం లో  124 ఫైళ్లు  లభ్యమయ్యాయి. సరే ఇప్పుడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసులో నిందితుడైన మాజీ ఆర్డీవో మురళిని పోలీసులు అరెస్టు చేశారు.  సుప్రీం కోర్టు ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిలు రద్దు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  దీంతో ఇప్పుడీ కేసులో ఫైళ్ల దగ్ధం కుట్ర వెనుక ఉన్న పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.