ప్రధాని ఎవరైనా.. మేము మాత్రం కాంగ్రెస్ తోనే ఉంటాం

 

ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదని.. కానీ తాము మాత్రం కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. 35 సంవత్సరాలుగా పుట్టిన రోజు నాడు శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు.

కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి 18 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్‌ మాట్లాడుతూ.. మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ‍్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్‌ పేర్కొన్నారు.