TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారాయణ విద్యాసంస్థల అధిపతి, మాజీ మంత్రి నారాయణ అరెస్టు

Published on: Tue May 10, 2022 12:12PM

అనుకున్నంతా అయ్యింది...నారాయణ విద్యాసంస్థల అధిపతి, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అదుపులోనికి తీసుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను ఏపీకి తరలిస్తున్నారు. కాగా ఆయన సొంత కారులోనే నారాయణను ఏపీకి తరలిస్తున్నారు. నారాయణ అరెస్టు వ్యవహారం అంతా అత్యంత రహస్యంగా జరిగింది. 
ఆయనను అదుపులోనికి తీసుకోవడానికి ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజే కారణమని భావిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీలో టెన్త్ పేపర్లు లీక్ కాలేదని బల్లగుద్ది మరీ చెబుతుంటే.. సీఎం జగన్ సహా ఏపీ మంత్రులు టెన్త్ పేపర్ల లీకేజి వెనుక నారాయణ విద్యా సంస్థల హస్తం ఉందని చెబుతూ వచ్చారు. అంతే కాకుండా లీకేజీ బాధ్యులు అంటూ పలువురు ప్రభుత్వ టీచర్లపై కూడా చర్యలు తీసుకున్నారు. జగన్ ఎప్పుడైతే.. లీకుల వెనుక నారాయణ విద్యాసంస్థలు ఉన్నాయని అన్నారో అప్పుడే నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్టు తప్పదని అంతా భావించారు. కాగా నారాయణ అరెస్టు వార్త తెలిసిన వెంటనే నారాయన విద్యాసంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇంత వరకూ ఏపీ సీఐడీ నారాయణను ఎందుకు అరెస్టు చేసిందీ ప్రకటించలేదు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి మరీ నారాయణను అదుపులోనికి తీసుకున్న కారణాలపై ఏపీ సీఐడీ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. కేవలం నారాయణను అరెస్టు చేశాం, విచారణ నిమిత్తం ఏపీకి తీసుకు వెడుతున్నామని మాత్రమే వారు చెబుతున్నారు.

అయితే నారాయణ అరెస్టుకు టెన్త్ పరీక్షా పత్రాల లీకుల వ్యవహారమే కారణమని అనుకుంటున్నారు. టెన్త్ పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల హస్తం ఉందని సాక్షాత్తూ ప్రభుత్వమే ఆరోపణలు గుప్పించడంతో ఆ వ్యవహారంలోనే నారాయణ అరెస్టు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంతకీ విద్యా మంత్రి బొత్స సత్యానారాయణ టెన్త్ పేపర్లు లీక్ కాలేదని చెబుతుంటే... లీకేజీ కేసులో నారాయణను ఎలా అరెస్టు చేశారన్న విషయంపై మంత్రి వివరణ ఇవ్వాలని నారాయణ విద్యాసంస్థల సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. అలాగే పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహించి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.