TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అజ్ణాతంలోకి మాజీ మంత్రి జోగి రమేష్?

Published on: Mon Feb 2, 2026 2:22PM

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లారా అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. మాజీ మంత్రి నారా లోకేష్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచీ ఆయన ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని పోలీసులు కూడా భావిస్తున్నారు. విషయమేంటంటే..జోగి రమేష్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు.

ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. నిప్పు పెట్టారు. జోగి రమేష్ క్షమాపణ చెప్పే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేశారు. ఇది జరిగిన తరువాత జోగి రమేష్ ఆదివారం (ఫిబ్రవరి 1) రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి  మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు జోగి రమేష్ నివాసానికి వచ్చారు. ఆ తరువాత ఇరువురూ కలిసి జోగి రమేష్ కుమారుడిని కూడా తీసుకుని బయటకు వెళ్లారు. ఆ తరువాత నుంచీ జోగి రమేష్ ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు.

అసలింతకీ జోగి రమేష్ అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లడానికి కారణం ఏమిటంటే.. నారా లోకేష్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసే కారణమంటున్నారు.  ఆ కేసులో అనుచిత వ్యాఖ్యలే కాకుండా, జోగి రమేష్ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనీ, శాంతి భద్రతలకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారనీ పోలీసులు పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అరెస్టైతే బెయిలు దొరకడం కష్టమని భావించే జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లారని పరిశీలకులు అంటున్నారు.