TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్టు

Published on: Sat May 9, 2026 10:06AM

కరీంనగర్ జిల్లాలో   రాజకీయ హీట్ పీక్స్ కు చేరింది. గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్  శనివారం ( మే9) కరీంనగర్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు చర్యగా పోలీసులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ  సందర్భంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అసలు వివాదం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా మొదలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్ర చర్చనీ యాంశమైంది.  ఈ ఘటన వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. అది తమపై చేస్తున్న కుట్ర అని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  కాగా బంద్ నేపథ్యంలో కరీంనగర్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.   ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతుండగా..  మరోవైపు బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.  

కరీంనగర్‌లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజలు, వ్యాపారులు యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వాణిజ్య సంస్థలు యధావిధిగా తెరిచి ఉంచాలని కోరుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరీంనగర్ జిల్లా రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది.