టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని బాలినేని ఇలా వాడేస్తున్నారా?

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్లున్న ఫ్యాన్ పార్టీ నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి వేళ.. ప్రజల నుంచి తమకు నిరసన సెగ తగలకుండా వైసీపీ నేతలు కొత్త చిట్కాలతో జనం మధ్యకు వస్తున్నారు.  ఆ క్రమంలో ఇప్పటికే.. ఓ ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గ ప్రజలకు సబ్బులు పంచారు. ఎన్నికల సమయంలో సోపులు ఎలాగా ఉంటాయని చెప్పకనే చెప్పారు. మరొక ఎమ్మెల్యే  తిను బండారాలను పందేరం చేశారు. తమ నేత పాలనలో జనం ఏం కొనుక్కునే పరిస్థితి..ఏం తినే పరిస్థితి లేదని ఈ విధంగా  సంకేతం ఇచ్చారని అంటున్నారు.

అయితే మాజీ మంత్రి బాలినేని మాత్రం వీరందరినీ తలదన్నేలా ఖరీదైన తాయిలం ఇచ్చి జనం నిరసన సెగను తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే అది కాస్తా బూమరాంగ్ అయ్యిందనుకోండి అది వేరే విషయం. ఇంతకీ విషయమేమిటంటే.. ఒంగోలు ఎమ్మెల్యే, సీఎం జగన్ సమీప బంధువు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడపగడపకూ కార్యక్రమంలో ప్రజా నిరసన సెగ తనకు తగలకుండా ఉండేందుకు దేవుడి ప్రతిమలు, అవీ వెండి ప్రతిమలు పంచుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మీడియంలో  తెగ వైరల్ అయ్యింది. మీడియాలోనూ హల్ చల్ చేసింది.   అయితే బాలినేని ప్రజలకు పంచుతున్న ఈ వెండి ప్రతిమలను తీసుకువచ్చిన సంచులపై తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీనివాస కల్యాణం అని రాసి ఉండటంతో..ఆయన పందేరం బూమరాంగ్ అయ్యింది. దేవుడి సొమ్ముతో సొంత సోకు చేస్తున్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి కల్యాణం తాలూకు వెండి విగ్రహాలను స్వకార్యం కోసం పప్పుబెల్లాలుగా పంచడమేమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు.  

టీటీడీ బోర్డు చైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయానా బావ అవుతారు.. ఈ పందేరమంతా   సుబ్బారెడ్డి శ్రీవారి ఖాతా నుంచి బాలినేని కోసం స్పాన్సర్ చేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.  

 ఏదీ ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలవ లేమనే ఓ అంచనాకు వైసీపీ నేతలు వచ్చేసిన కారణంగానే.. ఆ డిస్పరేషన్ లో ఏలాగైనా జనాన్ని మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకు తెరతీస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పటికే జనం ముందుకు రావడానికి ఏవో తాయిలాలు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఉన్న వైసీపీ నేతలు నిజంగా ఎన్నికల వేళ ప్రచారానికి రావలసి వస్తే ఇంకేం పంచుతారో అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు స్వామి వారి ఖాతాలోంచి వెండి ప్రతిమలు పంచిన బాలినేని.. ముందు ముందు అంటే ఎన్నికలలో ఓట్ల కోసం అదే శ్రీవారి ఖజానా నుంచి సుబ్బారెడ్డి సౌజన్యంతో బంగారు ప్రతిమలో, ఆబరణాలో పంచేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.