TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటర్ పాసైన మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ

Published on: Fri Jun 12, 2026 9:34AM

పట్టుదల ఉంటే చదువుకు వయస్సు అడ్డం కాదని నిరూపించారు మావోయిస్టు మాజీ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.  ఒకప్పుడు తుపాకీ పట్టి దండకారణ్యంలో  దళాలను నడిపించిన ఆయన..  ఇప్పుడు పుస్తకం పట్టి విజయాలు సాధిస్తున్నారు. ఆయుధం విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ  న్యాయవాది కావాలనే తన జీవిత ఆశయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే..  42 ఏళ్ల  విరామం తర్వాత   ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ..  నాలుగు దశాబ్దాల క్రితం మధ్యలో ఆగిపోయిన తన చదువును మళ్లీ కొనసాగించాలని గట్టి సంకల్పంతో  శ్రద్ధగా చదివి ఇంటర్ పరీక్షలు రాశారు.  ఈ పరీక్షల్లో ఆయన   349వ  ర్యాంకు సాధించారు.   ఐదేళ్ల లా కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తప్పనిసరి. 

దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో..  దేవ్‌జీ ఇటీవల జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 42 ఏళ్ల క్రితం మిగిలిపోయిన ఆ ఒక్క తెలుగు పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 100 మార్కులకు గాను 72 మార్కులు సాధించి ఘన విజయం సాధించారు. దీనితో మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్మీడియట్ విద్యను అధికారికంగా పూర్తి చేశారు. తుపాకీ పట్టిన చేత్తో కలం పట్టి, విద్య ద్వారా కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించిన దేవ్‌జీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది.