TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిఎ సంగ్మా మృతి- సోనియాను ఎదిరించిన కాంగ్రెస్ నేత!

Published on: Fri Mar 4, 2016 11:06AM

 

మాజీ లోక్‌సభ స్పీకర్‌ పిఎ సంగ్మా, ఇవాళ దిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న సంగ్మా 68 ఏళ్ల వయసులో తుదిశ్వాసను విడిచారు. మేఘాలయకు చెందిన సంగ్మా ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఎనిమిది దఫాలుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తుర అనే నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన అత్యంత ప్రతిభావంతమైన నాయకులలో ఒకరిగా సంగ్మాను ఎంచుతారు. సంగ్మా మొదటి నుంచీ కూడా కాంగ్రెస్‌కు వీరవిధేయునిగా ఉండేవారు. ఆ పార్టీ తరఫున కొద్దికాలం మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కానీ విదేశీ వనిత అయిన సోనియా గాంధి నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు.

 

దీంతో సంగ్మాను, శరద్ పవార్‌, తారిఖ్‌ అన్వర్‌లతో పాటుగా కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన ఈ ముగ్గురు నేతలూ ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ’ పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించి విజయవంతంగా నడిపించారు. అయితే శరద్‌ పవార్‌ తిరిగి సోనియాకు దగ్గరవడాన్ని సంగ్మా తరచూ వ్యతిరేకించేవారు. 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొనగా, ఆయనకు పోటీగా సంగ్మా బరిలోకి దిగారు. పోటీకి దిగాలన్న సంగ్మా నిర్ణయాన్ని పవార్‌ వ్యతిరేకించడంతో తను స్థాపించిన పార్టీకే రాజినామా చేసేందుకు వెనుకాడలేదు సంగ్మా! 2013లో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ పేరుతో మరో పార్టీని స్థాపించిన సంగ్మా ఆ పార్టీ బలాన్ని పుంజుకునే సమయంలోనే కన్నుమూశారు.