TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డామిట్ కథ అడ్డం తిరిగింది.. మాజీ హోంమంత్రి సుచరిత ఆవేదన

Published on: Sat Jun 11, 2022 11:51AM

టైమ్ బాగుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది...అదే బాగు లేకపోతే తాడే పామై కరుస్తుంది. ప్రస్తుతం ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత టైం ఏ మాత్రం బాగోలేదనిపిస్తోంది. మేకతోటి సుచరిత హోంమంత్రి పదవిని కోల్పోయి కేవలం రెండంటే రెండు నెలలయ్యింది. ఈ రెండు నెలలలో ఆమె పార్టీ అధిష్ఠానం నుంచీ, క్యాడర్ నుంచీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవమానాలు భరించారు. ఒక దశలో ఏకంగా ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.  ఆ తరువాత ఎలాగోలా పరిస్థితి సద్దుమణిగిందని అనిపించింది. సుచరిత కోరుకున్నట్లుగా అధిష్ఠానం నుంచి పిలుపూ వచ్చింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మంత్రి పదవి పోయింది తప్ప మరే ఇతర కారణాలూ లేవనీ హై కమాండ్ ఆమెకు నచ్చ చెప్పింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఆమె భర్త మేకతోట దయాసాగర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇందుకు కారణమేమిటంటే మళ్లీ వైసీపీలోని మేకతోట సుచరిత వ్యతిరేక వర్గమే కారణమని తేలుతోంది. స్వయంగా సుచరితే  ఈ ఆరోపణ చేస్తున్నారు. సుచరిత హోంమంత్రిగా ఉన్న సమయంలో  ఆమె భర్త, ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్  విజయవాడలో ఆదాయపన్ను శాఖలో కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ  సమయంలో పలువురు వైసీపీ నేతలు స్వయంగా ఐటీ కార్యాలయానికి వెళ్లి దయాసాగర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పి ఫోటోలు  దిగారు.

అయితే ఆయన స్వరాష్ట్రానికి రావడం.. అదీ కీలక పదవిలో రావడం.. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలకు ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. దీంతో వారు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. ఓ రాష్ట్రంలో భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు.. సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు నేతలు నిద్రపోలేదు. ఈ విషయాన్ని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.అంతేకాదు.. దయాసాగర్ బదిలీ కోసం ఆ నేతలు ఢిల్లీలోనే  తిట్ట వేసుకుని.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో దగ్గరుండి మరీ దస్త్రాలు కదిలేలా చేశారనే టాక్.. కూడా అప్పట్లో హాట్ హాట్‌గా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడింది. కానీ ఈ దయాసాగర్‌కు అక్కడ పని చేయడం సుతరాము ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్ఎస్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇలా దరఖాస్తు చేసుకోవడం.. అలా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. శర వేగంగా జరిగిపోయిందట.
     
మరోవైపు దయాసాగర్ పదవి విరమణ తర్వాత..  ఆయన్ను లోక్‌సభ లేదా అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని సుచరిత స్కెచ్ వేశారని.. ఆ క్రమంలోనే ఆయన్ని స్వరాష్ట్రానికి రప్పించారని.. ఇక్కడే ఉద్యోగం చేసి... ఇక్కడే పదవి విరమణ చేసిన తర్వాత.. ఆయన్ని రాజకీయాల్లోకి దింపాలని ఈ మాజీ మంత్రిగారు ప్లాన్ సిద్దం చేసుకున్నారని... కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ    కీలక నేతలు .. దయాసాగర్‌ను బదలీ చేయించే వరకు నిద్రపోలేదనే వార్త వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.  మరి తాజాగా మాజీ అయిన హోం శాఖ మంత్రి భర్త.. వచ్చే ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబడి.. తన సత్తా చాటి.. తనను బదిలీ చేయించిన  వైసీపీ నేతలకు ఝలక్ ఇస్తారా? అనే చర్చ అయితే ఇప్పడు పత్రిపాడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.