జనసేనలో బిగ్ వికెట్ డౌన్.. బీజేపీలోకి జంప్

 

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనుకున్న జనసేన.. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటుకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈ ఓటమిని నుండి పాఠాలు నేర్చుకొని వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా ఎదగాలనుకుంటున్న జనసేనకు.. అప్పుడే మొదటి షాక్ తగిలింది.

జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని కోరుతూ ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి జనసేన తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రావెల.. మూడో స్థానంలో నిలిచారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనుకున్న రావెల.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రావెల ప్రధాని మోడీ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తిరుపతి పర్యటనకు వస్తున్న మోడీ.. రేపు సాయంత్రం శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఈ సమయంలో ఎక్కడో చోట రావెల కిషోర్‌కు కండువా కప్పనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల తర్వాత జనసేనలో ఉన్నవారిలో కాస్త ప్రముఖ నేతను పవన్ కళ్యాణ్ కోల్పోతున్నట్లే భావించాలి.