TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీవీ9 రవిప్రకాష్‌పై కేసు నమోదు.. సీఈవోగా తొలగింపు

Published on: Thu May 9, 2019 3:50PM

 

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఛానల్‌ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీ-9లో రవిప్రకాష్‌ భారీ ఎత్తున కంపెనీ నిధులను దారి మళ్ళించారని ఆరోపించారు. కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా టీవీ 9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్‌ నివాసంలోనూ సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు.

కొద్ది రోజుల క్రితం టీవీ 9ను అలంద మీడియా టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. టీవీ 9 వాటాల అమ్మకం, యాజమాన్యం మార్పిడికి సంబంధించి కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోంది. టీవీ9లో 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాష్‌ కాలరాస్తున్నారని.. కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని కొత్త యాజమాన్యం ఆరోపిస్తోంది. మరోవైపు టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించినట్లు తెలుస్తోంది.