ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా హఠాన్మరణం.. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి 

ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా 60 ఏళ్ల వయసులో బుధవారం గుండె పోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నవంబరు మొదటి వారంలో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స జరిగింది. గతంలో జరిగిన ప్రమాదం వలన మారడోనాకు ఈ సమస్య వచ్చిందని న్యూరాలజిస్ట్ లీయోపోల్డో లాఖ్ గతంలోనే తెలిపారు. అయితే సర్జరీ తరువాత వారం రోజుల క్రితమే బ్యూనస్ ఏర్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోమ్‌లో ఉంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ అంతలోనే గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు మారడోనా.

 

అర్జెంటీనా తరఫున మారడోనా 91 మ్యాచ్‌ల్లో 34 గోల్స్‌ సాధించాడు. 16 ఏళ్ల వయసులో 1977లో హంగేరిపై మొదటి మ్యాచ్‌ ఆడాడు. 1978లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌ కప్ లో డీగోకు చోటుదక్కలేదు. వయసు తక్కువ కావడంతో అతడిని టీమ్‌కు ఎంపిక చేయలేదు. 1979లో జరిగిన ఫిఫా యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మారడోనా స్టార్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి అంతర్జాతీయ గోల్‌ సాధించాడు. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986లో అర్జెంటీనా కు ప్రపంచ కప్ అందించారు. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అయన కెరీర్‌, జీవితంలో మారడోనా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్‌ బారినపడి చావు అంచుల వరకు వెళ్లినా.. మళ్లీ రాగలిగాడు.