సాకర్ జగజ్జేత ఫ్రాన్స్

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఫుట్‌బాల్ అభిమానుల కేరింతలతో నెల రోజులు జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అంచలంచెలుగా ప్రత్యర్ధులను తమ గోల్స్‌తో మట్టి కరిపించిన ఫ్రాన్స్ ఫైనల్ ప్రత్యర్ధి క్రొయేషియాపై 4 - 2 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. నెల రోజులుగా ఆశగా చూస్తున్న  ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు ఆ జట్టు ఆటగాళ్లు. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచ కప్ విజయం. తొలిసాకి 1998 సంవత్సరంలో తొలిసారి ప్రసంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆ కల ఈడేరడం కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు
ఎదురుచూడాల్సి వచ్చింది.  ఇరవై సంవత్సరాల తర్వాత తీరిన కలతో ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. మన దేశంలో కూడా ఫుట్‌బాల్‌ పట్ల ఎంతో ఆదరణ ఉంది.

 

 

క్రికెట్‌ను మాత్రమే ఆదరిస్తారని ఇన్నాళ్లూ అన్నుకున్న భారత క్రికెట్ అభిమానులకు ఈ ఫుట్‌బాల్ అభిమానులు చూపించిన ఆదరణకు అదిరిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పట్ల ప్రజల్లో ఎంత క్రేజ్ ఎంతో ఉందో ఈసారి పోటీలు మళ్లీ మరోసారి నిరూపించాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్ పోటీలు అన్నీ ఉత్కంఠగా జరిగినవే. చివరికి అతి చిన్న జట్టుగా అసలెలాంటి అంచనాలు లేని క్రొమేషియా ఫైనల్‌కు రావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఫైనల్‌పై పడింది. జయపజయాల మాట పక్కన పెడితే ఫుట్‌బాల్ క్రీడ మనుషుల్లో ఉన్న ఓ పట్టుదలను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది.

 

 

అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లేని క్రేజ్ ఈ ఫుట్‌బాల్ పట్ల చూపిస్తారు అభిమానులు. క్రికెట్ పట్ల కేవలం పది పన్నెండు దేశాలు మాత్రమే ఆసక్తి చూపిస్తే ఫుట్‌బాల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. దానికి కారణం ఈ పోటీ గంట లోపే ఫలితం తేలడంతో పాటు బరిలో ఇరు జట్లు చూపించే వ్యూహప్రతివ్యూహాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందుకే కోట్ల మంది ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో నూ, కేరళలోనూ మాత్రమే ఫుట్‌బాల్ పట్ల క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రాల నుంచే భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడాకారులు ఎంపికవుతారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడపై ఆసక్తి పెంచేందుకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. దే:శంలో ఇంతకు ముందు ప్రపంచం గర్వించే ఫుట్‌బాల్ క్రీడాకారులున్నారు.

 

 

వారిలో అగ్రగణ్యుడు నివీల్డి డిసౌజా. భారత ఫుట్‌బాల్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన క్రీడాకారుడు డిసౌజా. 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అనూహ్య విజయాన్ని అందించింది డిసౌజానే. ఆయన తర్వాత భారత ఫుట్‌బాల్‌‌కు దేవుడిచ్చిన వరంగా చెప్పుకునే బైచుంగ్ భాటియా. ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో బ్రెజిల్ క్రీడాకారులు పీలే, అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మరడోనాలు ఎంత గొప్పవారు మన దేశానికి భాటియా కూడా అలాంటి క్రీడాకారుడే.

 

 

దేశంలో క్రికెట్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు ఇతర క్రీడలపై కూడా ఆదరణ చూపిస్తే మనకు పీలేలు, డిగో మరడోనాలు తయారవుతారు. భారత జాతీయ క్రీడ హాకీని పట్టించుకోకపోవడం వల్ల ఆ క్రీడ దాదాపుగా కనుమరుగవుతోంది. క్రికెట్ ఒక్కటే మన క్రీడగా మిగులుతున్న దశ ఇది. ఈ జాడ్యం పోతే హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కో కో వంటి క్రీడల్లో భారత్ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఎంతటిదో చూపిస్తాయి.