TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇటుక బ‌ట్టీ కూలీగా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌.. బ‌తుకు జ‌ట్కా బండి..

Published on: Sun May 23, 2021 4:05PM

పుట్‌బాల్‌. ఇండియాలో అంత‌గా పాపులారిటీ లేని ఆట‌. అంత‌ర్జాతీయంగా మాత్రం ఫుల్ క్రేజ్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా డ‌బ్బు సంపాదించేది ఫుట్‌బాల్ ప్లేయ‌ర్సే. ఆ ఆట ఆడాలంటే అధిక శారీర‌క సామ‌ర్థ్యం ఉండాలి. ఇక  నైపుణ్యం అయితే ఓ రేంజ్‌లో అవ‌స‌రం. మెరుపులా ప‌రుగు పెట్టాలి. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు మ‌స్కా కొట్టి గోల్ కొట్టాలి. అలాంటి ప్రావీణ్యమే ఉన్న ఓ అంత‌ర్జాతీయ ఫుట్ బాలర్ అయిన ఓ అమ్మాయి.. మ‌న ద‌గ్గ‌రా ఉంది. ఆమె పేరు సంగీతా సోరెన్‌. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్ 17 పోటీల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు సీనియర్ జాతీయ జట్టుకూ పిలుపొచ్చింది. టీమ్ లో ఇక చేరడమే తరువాయి అన్న టైంలో.. లాక్ డౌన్ వచ్చిపడింది. ఆమె బ‌తుకు జ‌ట్కా బండి త‌ల‌కిందులు అయింది. లాక్ డౌన్ తో కుటుంబ భారం మొత్తం ఆమెపైనే పడింది. 

జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా బాసమూది గ్రామం ఆమెది. ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకూ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆ ఉపాధి పోయింది. దీంతో కాళ్లతో బంతిని తన్ని గోల్ కొట్టాల్సిన ఆమె.. చేతుల‌తో ఇటుకలు మోస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తన కల అయిన ఫుట్ బాల్ ను వదిలేది లేదని, అప్పటి వరకు బతుకు బండి నడవడానికి పనిచేయక తప్పదని సంగీత అంటోంది. కూలీకి వెళ్లే ముందు.. రోజూ ఉద‌యం సమీపంలోని పొలాల్లో ఫుట్‌బాల్ ఆట‌ను సాధ‌న చేస్తూ.. ఆట‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటోంది. 

గ‌తంలో సంగీత‌ సోరెన్‌ను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హేమంత్ సోరెన్ హామీ ఇచ్చినా.. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో తల్లితో కలిసి ధన్ బాద్ లోని ఓ ఇటుకల బట్టిలో కూలి ప‌ని చేస్తోంది. ప్రతి ప్లేయర్ కు మంచి ఆహారం, ప్రాక్టీస్ ముఖ్యమని, అలాంటి వాటిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని మండిప‌డుతోంది. అందుకే తన లాంటి ఆట‌గాళ్లంతా కూలీలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ సంగీత సోరెన్‌.