ఆహార భద్రత బిల్లుపై తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు సునిశిత విమర్శలు

 

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాల్చిపెట్టగలదని ఆశిస్తున్న ప్రతిష్టాత్మకమయిన ఆహార భద్రత బిల్లుపై ఈ రోజు లోక్ సభలో వోటింగ్ జరిగింది. జేడీ (యు), ఆర్.జే.(డీ), బీయస్పీ, మరియు యం.ఐ.యం. పార్టీలు బిల్లుకి మద్దతు తెలుపగా, శివసేన మాత్రం వ్యతిరేఖించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు సవరణలను సభ ఆమోదించగా, ప్రతిపక్ష పార్టీ యంపీలు సుష్మ స్వరాజ్ సంపత్, గురుదాస్ గుప్తాలు ప్రతిపాదించిన ఆరు సవరణలు మాత్రం తిరస్కరించింది.

తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆహార భద్రత బిల్లుని ప్రతిపాదించడం అంటే ఇన్నేళ్ళుగా పేదలకు కడుపు నిండా తిండి అందించడంలో వైఫల్యం చెందిందని అర్ధం అవుతోంది.ఇన్ని దశాబ్దాల పాలన తరువాత కూడా దేశంలో పేద ప్రజలు తిండికి నోచుకోవడంలేదని ఈ బిల్లు ద్వారా స్పష్టం అవుతోంది. అందుకు సిగ్గుపడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం తానేదో పేదలకి మేలు చేస్తున్నట్లు నేడు ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. దానిలో ఉన్న లొసుగులను తొలగించి ప్రవేశపెట్టి ఉంటే ఆ బిల్లుయోక్క ప్రయోజనం నెరవేరేది. కానీ, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోసుగులమయమయిన ఈ బిల్లును హడావుడిగా ప్రవేశపెడుతోంది. దీనివల్ల పేద ప్రజలకు లాభం జరగడం సంగతి ఎలా ఉన్నపటికీ, అబిల్లు పేరు చెప్పుకొని కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని ఆత్రం పడుతోంది. ఆ ఆత్రంలో కనీసం ప్రతిపక్షాలు చేస్తున్నసూచనలను, సలహాలను కూడా అది పట్టించుకొనే స్థితిలో లేకపోవడం చాలా విచారకరం," అని అన్నారు.