వంకాయ చికెన్ తో డిన్నర్.. గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
Published on: Tue Jun 28, 2022 10:54AM
మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజినింగ్.. 107 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు ఫుడ్ పాయిజిన్ అవ్వడంతో 107 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన సిద్దిపేట గురుకుల పాఠశాలలో జరిగింది.
సోమవారం సిద్ధిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో రాత్రి డిన్నర్ లోని చికెన్ వంకాయ వండారు. అదితిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి నుంచీ విద్యార్థులు బాధపడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
సోమవారం ఉదయానికి పరిస్థితి తీవ్రం కావడంతో అధికారులు హుటాహుటిన అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజిన్ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారు.
దాంతో మంగళవారం ఉదయానికి కానీ విషయం వెల్లడి కాలేదు. తమ పిల్లలు ఆసుపత్రి పాలైనా తమకు సమాచారం అందించడంలో తీవ్ర జాప్యం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆరోపణ చేస్తున్నారు.


