ఫ్లూ + కరోనా = ఫ్లూరోనా.. జలుబు, కొవిడ్ కలిస్తే మరింత డేంజరస్!
Published on: Tue Jan 11, 2022 11:04AM
జలుబు అందరికీ వస్తుంది. వేధిస్తుంది. కరోనా అజాగ్రత్తగా ఉంటే కుమ్మేస్తుంది. జలుబు టార్చర్ చేస్తే.. కరోనా మాత్రం ఏకంగా ప్రాణాలనే తీసేస్తుంది. అలాంటిది.. జలుబు, కరోనా ఒకేసారి దాడి చేస్తే. అదే.. ఫ్లూ + కరోనా = ఫ్లూరోనా.
ఇదేమీ కొత్తరకం కరోనా వైరస్ కాదు. కొత్త రోగమూ కాదు. జంట ఇన్‌ఫెక్షన్ అంతే. అంటే ఫ్లూ, కరోనా ఒకేసారి రావటం. అదే ఫ్లూరోనా. ఇది కలవరం కలిగించే విషయమే అంటున్నారు. తాజాగా, కొవిడ్‌తో పాటు ఫ్లూ కేసులూ పెరుగుతుండటం, ఇవి రెండూ కలిసి వస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
ఫ్లూ , కొవిడ్-19.. రెండూ శ్వాసకోశ సమస్యలే. వీటి లక్షణాలూ దాదాపు సమానమే. రెండింటిలోనూ జ్వరం, ముక్కు కారటం, ఆకలి తగ్గటం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, తుమ్ములు, తలనొప్పి, నిస్సత్తువ వంటివే ఉంటాయి. అయితే ఫ్లూ, కొవిడ్ రెండూ కలిస్తే.. తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. న్యుమోనియా రావొచ్చని అంటున్నారు.
న్యుమోనియాలో ఊపిరితిత్తుల్లోని కణజాలం, గాలిగదులు ఉబ్బి పరిస్థితి విషమిస్తుంది. దీంతో కొందరికి కృత్రిమ శ్వాస కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫ్లూరోనాలో రెండు వైరస్‌లను ఒకేసారి ఎదుర్కోవాల్సి రావటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మీద ఒత్తిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు.
ఫ్లూ, కొవిడ్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఫ్లూరోనాను గుర్తించటం కష్టం. రెండింటి పరీక్షలు చేస్తే గానీ నిర్ధరణ కాదు. ఇజ్రాయెల్‌లో తొలి ఫ్లోరోనా కేసును గుర్తించారు. ఇతర దేశాల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి.
ఫ్లూరోనా.. వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఆస్తమా, మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్, గుండెజబ్బుల వంటి సమస్యలు ఉన్న వారికి మరింత డేంజరస్. ఫ్లూరోనాకు కూడా కొవిడ్, ఫ్లూ చికిత్సలే చేస్తున్నారు.


