TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైద్యులకు వందనం.. ఆస్పత్రులపై పూలవర్షం

Published on: Sun May 3, 2020 12:30PM

కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్‌ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది.  నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి. 

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా  త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి. విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సంత్కరించారు. దిల్లీలోని పోలీస్‌ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. పోలీసుల గౌరవార్థం వైమానిక అధికారులు యుద్ధ స్మారకానికి దండలు వేశారు. విశాఖ, ముంబయి, చెన్నై, కొచ్చిలోని నౌకలకు ఈరోజు రాత్రి 7.30గంటల నుంచి 11.59 వరకు దీపాలంకరణ చేయనున్నారు.

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిపై..
ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలకు కృతజ్ఞతగా గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్‌ గులాబీ పూల వర్షం కురిపించింది. వైద్య సిబ్బంది అంకితభావానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద పలువురు నేతలు వైద్యులకు సంఘీభావం తెలుపుతూ జాతీయజెండాలను ప్రదర్శించారు.