TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వానలు.. వరదలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం..

Published on: Wed Jul 13, 2022 3:12PM

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండ పొడను చూసి నాలుగు రోజులైంది. నింగీ నేలా ఏకమయ్యాయా అన్నట్లుగా ఏకథాటిగా వాన పడుతూనే ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో కంటిమీద కునుకు తీయడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలూ భారీ వర్షాలూ, వరదలతో అతలాకుతలమైపోతున్నాయి. జులై నెలలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం, ఇంతటి భారీ వరదలు సంభవించడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటి సారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద రికార్డు స్థాయికి నీటి మట్టం చేరుకుంది.   ఇక కాళేశ్వరం వద్ద గోదావరి   మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.   దీంతో అధికారులు  ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.   ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్లం ప్రమాద స్థాయికి చేరింది.

 ఇప్పడో ఇహనో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.  ఇక పోలవరం వద్ద గోదావరి నది  వరద నీటితో పోటెత్తుతోంది.   పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.   ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.  ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

కాగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.  ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తునప్పటికీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.