TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లిప్‌కార్టుకు లక్షలకు లక్షలు టోకరా!

Published on: Wed Mar 2, 2016 3:21PM

 

ఆనలైన్ అమ్మకాల సంస్థ ఫ్లిప్‌కార్టుకు అడపాదడపా ఎదురయ్యే సమస్యే ఇది. మన హైదరాబాదు నుంచి కూడా ఇలా కొందరు సంస్థను మోసం చేసి ఆ తరువాత పట్టుబడ్డారు. కానీ పంజాబ్‌కి చెందిన ఆరుగురు కుర్రాళ్లు మాత్రం ఈ మోసాన్ని మరీ పెద్ద ఎత్తున చేద్దామని ప్రయత్నించి కటకటాల వెనక్కి చేరారు. వివరాల్లోకి వెళ్తే... పంజాబులోని మన్సా జిల్లాకు చెందిన కొందరు కుర్రవాళ్లు ఫ్లిప్‌కార్టు నుంచి ఖరీదైన ఫోన్లని ఆర్డరు చేసేవారు. తీరా అవి చేతికి వచ్చిన తరువాత, మాకు మీరు పంపిన ఫోన్‌ నచ్చలేదంటూ తిరిగి పంపేవారు. అసలు కిటుకు ఇక్కడే ఉంది.

 

తమకు అందిన అసలైన ఫోన్‌ని హాయిగా అమ్మేసుకుని, డబ్బాలో ఏదో చెత్త పెట్టి పంపేవారు. ఫ్లిప్‌కార్టుకి అనుమానం రాకుండా తరచూ వేర్వేరు ఈమెయిల్స్ ద్వారా, వేర్వేరు ఫోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. ఒకే ప్రాంతం నుంచి తమకు తిరిగి వచ్చే ఫోన్లలో మోసం జరుగుతూ ఉండటంతో ఫ్లిప్‌కార్టు అధికారులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగానే అసలు నిజం బయటకు వచ్చింది. నిందితులు ఇలా ఒకటి కాదు రెండు కాదు కనీసం 25 లక్షలదాకా ఫ్లిప్‌కార్టుని మోసం చేసినట్లు తేలింది. ఇంకా లోతుకి తవ్వితే, ఈ కుంభకోణం కోటి రూపాయల మార్కుని చేరుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.