TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీని ఢీ కొట్టేందుకు చంద్రబాబు ఫైవ్ పాయింట్ ఫార్ములా

Published on: Mon Jan 31, 2022 4:38PM

జగన్ సర్కారు తుగ్లక్ పాలన నుంచిప్రజల్నివిముక్తుల్నిచేయాలని,ఇందుకోసం వచ్చే మహానాడు నాటికి పార్టీ శ్రేణుల్ని ఉరకలెత్తించే విధంగా కార్యక్రమాలురూపొందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఏపీలో జగన్ పై వ్యతిరేకత వెల్లు వెత్తుతోందని, దాన్ని సరిగా ఉపయోగించుకుంటే టీడీపీ అద్భుతమైన ఫలితాలతో అధికారంలోకి వస్తుందని చంద్రబాబునాయుడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 

ఇందుకోసం ఫిబ్రవరి నుంచి స్థానిక సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేయాలని, వైసీపీ ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. 

1) స్థానిక, నియోజకవర్గ సమస్యలపై స్థానికంగానే పోరాటాలు చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోవడంపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసి పోరాటాలు రచించాలన్నారు.

2) గెలిచేవారిని, సమర్థులను టీడీపీ వదులుకోబోదని, అదే సమయంలో పార్టీ కోసం, ప్రజల కోసం పని చెయ్యని నేతలను ఉపేక్షించేది లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. కొందరు నాయకుల కారణంగా కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఇండైరెక్టుగా కొందరు టీడీపీ నేతలను హెచ్చరించారు. 

3) ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలని శ్రేణులకు సూచించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకు తినేందుకు జగన్ సిద్ధమయ్యారని విమర్శించారు. దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన ఉందని వివరించారు. టీడీపీ పోరాటాలతో ప్రజల్ని మమేకం చేయాలని సూచించారు. 

4) జిల్లాల పునర్విభజనపై ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్నారు. జిల్లాల విభజనను రాజకీయం కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా చేయాలన్నారు. దీనికోసం ప్రజాశ్రేణుల్ని ఎక్కడికక్కడ టీడీపీ నేతలు సమాయత్తం చేయాలన్నారు. 

5) టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న దృష్ట్యా వచ్చే మహానాడుతో పాటు పార్టీ కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ హయాంలో పెట్టిన 14 పథకాలు తొలగించి, వాటి పేర్లు తీసివేసిన జగన్.. ఇప్పుడొక జిల్లాకు ఎన్టీర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీ శ్రేణుల పోరాటంతో టీడీపీలో జోష్ పెరిగిందని, అదే సమయంలో వైసీపీ పెడపోకడలను ప్రజలు బాగా గుర్తించారని సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఇంచార్జులను నియమించిన మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఆత్మస్థైర్యం ఇచ్చేలా పని చేస్తున్నారని అక్కడి నాయకత్వాన్ని ప్రశంసించారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండేదని, దీన్ని టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారన్నారు. అలాగే క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నానిని ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని ఫిక్స్ చెయ్యడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని కితాబిచ్చారు.