మున్నేరులో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి.. సెలవుల్లో విషాదం..
Published on: Tue Jan 11, 2022 9:52AM
స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు. పిల్లలంతా ఇంటి దగ్గరే ఉన్నారు. ఆడుకుంటున్నారు. పాడుకుంటున్నారు. ఎప్పుడూ ఇవే ఆటలా బోర్ కొడుతోంది అన్నాడు అందులో ఒకడు. అయితే సరే.. అలా సరదాగా వాగుకు వెళ్లి ఈత కొడదాం పదండి అన్నాడు ఇంకొకడు. మొత్తం ఐదుగురు పిల్లలు. సరే అంటే సరే అంటూ అంతా జాయ్ జాయ్‌గా సైకిళ్లపై మున్నేరు వాగు దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో వారికి తెలీదు.. అదే తమ చివరి ప్రయాణమని.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేమని.
మరోవైపు.. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికొచ్చే సరికి పిల్లలు కనిపించలేదు. ఆరాట పడిన పేరెంట్స్ చుట్టుపక్కల వెతకటం మొదలుపెట్టారు. ఆ చిన్నారులు మునేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో టెన్షన్ పడ్డారు. మున్నేరుకు వెళ్లి చూసే సరికి గట్టుపై సైకిళ్లు, బట్టలు కనిపించాయి. అంతే. ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది.
వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి.. పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం నుంచి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభించాయి.
తమ పిల్లలు వాగులో కొట్టుకుపోయారనే అనుకున్నారు కానీ.. ఇలా చనిపోతారని ఆ తల్లిదండ్రులు అస్సలు ఊహించలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఉదయం పిల్లల మరణం విషయం తెలిసి.. ఆ ఐదు కుటుంబాలు శోకసంద్రమయ్యాయి. ఈ విషాదం.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర జరిగింది. ఏడో తరగతి చదువుతున్న మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), ఆరో తరగతి విద్యార్థి మైలా రాకేష్ (11), తొమ్మిదో తరగతి విద్యార్థి గురజాల చరణ్ (14) మున్నేరులో మునిగి మృత్యువాత పడటం స్థానికంతా విషాదం నింపింది.


