ఐదుగురు జవాన్ల వీరమరణం.. కశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్..
Published on: Mon Oct 11, 2021 2:47PM
జమ్మూకశ్మీర్‌లో భారత్ జవాన్లకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ఇటీవల బోర్డర్‌లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. తాలిబన్ల హస్తమూ ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. తాలిబన్ల పాత్రను కొట్టిపారేయలేమంటూ ఇటీవల ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
తాజాగా, ముష్కరుల కోసం ఆర్మీ పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టింది. ఈ సందర్భంగా పూంఛ్ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ముష్కరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు నేలకొరిగారు.
పూంఛ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో కొందరు వాస్తవాధీనరేఖను దాటి చర్మేర్ అటవీ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లి గాలింపు చేపట్టారు. సడెన్‌గా సోల్జర్స్‌పై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఉగ్రవాదులు నక్కిన అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అడవిలో ఉన్నట్టు సమాచారం. ముష్కరుల కోసం పెద్ద ఎత్తున వేట కొనసాగుతోంది.


