TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజంపేటలో పూర్తయిన మొదటిరౌండ్ ఎన్నికల ప్రచారం

Published on: Mon May 14, 2012 12:19PM

కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉప ఎన్నికల వేడి మొదలైంది. మూడు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మొదటిరౌండ్ ప్రచారాన్ని పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా జగన్మోహన రెడ్డి సొంతజిల్లా కడపలో జరుగుతున్నందున అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పర్యటన అనంతరం నియోజకవర్గ పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. అయితే మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్యకు టిక్కెట్టు ఇవ్వటం పట్ల రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జి సత్తిరెడ్డి మదనమోహన రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ,మదన్ వర్గీయులు అనేకమంది టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడా మల్లిఖార్జునరెడ్డి కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న మంత్రి రామచంద్రయ్యతో కలిసి మండలాల వారీగా ప్రధాననేతలను కలుస్తున్నారు. సీనియర్ నాయకులు ఎద్దుల సుబ్బారాయుడు, పిఆర్పీ నేతలు జరిప్రసాద్, వెంకటయ్య, చంద్రశేఖరరాజులతో చర్చలు జరిపి వారి మద్దతును కూడగట్టుకున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి అమరనాథ్ రెడ్డి ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేగా ఉండగానే అన్ని గ్రామాల్లో ఒకటికి రెండుసార్లు ప్రచారాన్ని పూర్తి చేశారు. తన అభ్యర్థిత్వం ముందుగానే తెలుసు కనుక, ఆయన తన అంగబలాన్ని ఉపయోగించి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీ కేడర్ ను ఉత్తేజపరుస్తూ ఎప్పటికపుడు ప్రచారంలో ముందున్నారు. ఈ విధంగా మూడు ప్రధానపార్టీల అభ్యర్థులు ప్రచారంలో ఎవరికీ వారుగా ముందుకు దూసుకుపోతున్నారు.