TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహారాష్ట్రలో తొలి ఓటమి

Published on: Mon May 1, 2023 11:51AM

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని, జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్న గులాబీ పార్టీకి ...  మహా రాష్ట్రలో తొలి అడుగులోనే ఓటమి ఎదురైంది.  బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలలో భాగంగా మహారాష్ట్ర పై ప్రత్యేక  దృష్టిని కేంద్రీకరించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ విస్తరణ ప్రస్థానంలో తొలి ప్రయత్నంగా తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు రెండు రోజుల క్రితం ( శుక్రవారం ) జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గంపగుత్తగా  ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్‌ మద్దతుదారులు 13, ఎన్సీపీకి 2,బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది.  ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి, బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.  ఆ వెంటనే వచ్చిన మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేసింది. అయితే.. ముందు నుంచి ఈ కమిటీలో కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్‌ వర్గం), బీజేపీకి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు కారణం.. ఈ మార్కెట్‌ మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ నియోజకవర్గ (భోకర్‌) పరిధిలో ఉండడంతో, ఆయన ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకున్నారు.  అటు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్‌ పాటిల్‌ చికిల్కర్‌ కూడా వారం రోజులుగా భోకర్‌లోనే ఉంటూ..  అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తూ.. బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది.

ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత  కేసీఆర్‌.. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో వచ్చిన భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.  కానీ, నాగ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా.. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ తమ మద్దతుదారులను గెలిపిస్తే.. తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది.

కాగా.. బీఆర్‌ఎస్‌ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని భావించినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన శివసేన(ఉద్ధవ్‌ఠాక్రే) వర్గం కూడా ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మార్కెట్‌ కమిటీల ఎన్నికల్లో ఫలితాలు విడుదలవ్వగా.. ఎప్పటిలానే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధిక స్థానాలను గెలుచుకుంది.