TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చారిత్రాత్మక తీర్పుల‌తో సంచ‌ల‌నం.. సీజేఐగా ఎన్వీ ర‌మ‌ణ‌కు ఏడాది..

Published on: Sat Apr 23, 2022 12:14PM

ఏప్రిల్ 24, 2021. తెలుగుజాతి గుర్తుంచుకునే రోజు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా తెలుగువారైన ఎన్వీ ర‌మ‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన రోజు. నేటికి స‌రిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో ఎన్నో మైలురాళ్లు. ఎన్నో చారిత్రాత్మ‌క తీర్పులు. తెలుగువారి స‌త్తాను.. సామ‌ర్థ్యాన్ని.. సీజేఐగా ఘ‌నంగా చాటారు జ‌స్టిస్‌ ర‌మ‌ణ‌. అందుకే, ఆయ‌న తెలుగు నేల‌పై అడుగుపెట్టినప్పుడ‌ల్లా ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు ప్ర‌జ‌లు. ర‌మ‌ణ‌పై ఎన‌లేని ఆద‌రాభిమానాలు చూపుతున్నారు. ఈ ఏడాది కాలంలో సీజేఐ ర‌మ‌ణ ఇచ్చిన తీర్పుల‌ను ఓసారి గుర్తు చేసుకుంటే...

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా బాధ్య‌త‌లు చేపట్టిన 3 రోజుల్లోనే.. మథుర జైలులో అనారోగ్యంతో మగ్గుతున్న జర్నలిస్టు సిద్దిఖీని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించడంతో ఒక్క‌సారిగా మీడియా అటెన్ష‌న్ నెల‌కొంది. అది మొద‌లు.. ప‌లు సంచ‌ల‌న తీర్పుల‌తో ఆయ‌న నిత్యం మీడియాలో హెడ్‌లైన్‌గా నిలుస్తున్నారు. 

తాజాగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఇళ్లను, దుకాణాలను బుల్‌డోజర్లతో ధ్వంసం చేస్తుంటే.. వాటిని వెంట‌నే నిలిపివేయించి బాధితుల‌కు ఊర‌ట నిచ్చారు. యూపీ, లఖీంపూర్‌ఖేరీలో 8 మంది రైతుల మరణానికి కారకుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ రద్దు చేసి న్యాయం ప‌వ‌ర్ ఏంటో చూపించారు. ఇక‌, య‌డాపెడా వాడేస్తున్న రాజద్రోహ చట్టాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముంద‌ని కేంద్రాన్ని ప్రశ్నించి నోటీసులు జారీ చేయ‌డం.. పెగాసస్‌ స్పైవేర్‌పై విచారణ కమిటీని నియమించడం.. జ‌స్టిస్‌ ర‌మ‌ణ‌కే సాధ్య‌మంటున్నారు. 

న్యాయవ్యవస్థలో ఖాళీలు నింపేందుకు కీలక చర్యలు చేప‌ట్టారు సీజేఐ రమణ. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. సుప్రీంకోర్టులో ఉన్న 9 ఖాళీలను గత ఆగస్టులోనే భ‌ర్తీ చేయించారు. అందులో ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులే ఉన్నారు. ఎన్వీ ర‌మ‌ణ హ‌యాంలో హైకోర్టులకు 126 మంది న్యాయ‌మూర్తుల‌ను నియమించారు. వీరిలో 20 శాతం మహిళలే. తెలంగాణ హైకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. హైద‌రాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్బిట్ర‌రీ సెంట‌ర్ ఏర్పాటుకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ ఆయ‌నే. 

ఇక‌, ప్ర‌జ‌లు రాస్తున్న లేఖ‌ల‌పై సీజేఐ ర‌మ‌ణ స్పంద‌న స్పూర్తిదాయ‌కంగా నిలుస్తోంది. తనకు లేఖ రాసిన కేరళ విద్యార్థినికి జవాబు రాసి ఆమెకు రాజ్యాంగ ప్రతిని బహూకరించడం.. తెలంగాణ చిన్నారి వైష్ణవి రాసిన లేఖకు స్పందించి.. ఆమె ఊరుకు స్కూలు బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవడం.. విడిపోయిన తెలుగు దంపతులు 20 ఏళ్ల తర్వాత కలిసి జీవించేలా వారితో తెలుగులోనే మాట్లాడి ఒప్పించ‌డం.. ఇలా ఏడాది కాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో త‌న‌దైన ముద్ర వేశారు  తెలుగుతేజం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.