ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 40 మందికి గాయాలు
Published on: Sat Jun 30, 2012 4:34PM
శ్రీకాకుళం జిల్లాలోని నాగార్జున ఆగ్రో కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ పేలుడు సంభవించిన సమయంలో సుమారు 200 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారో అధికారింగా ధృవీకరించలేదు. కాగా ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలియవచ్చింది. ఫ్యాక్టరీలోని ఐదో బ్లాక్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగో బ్లాక్కు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇందులో 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 10 కిలో మీటర్ల మేర ఆంక్షలు విధించారు. కాగా ఫ్యాక్టరీలో ఒకదాని నుంచి మరో రియాక్టరుకు మంటలు వ్యాపించి వరుసగా పేలుతుండడంతో మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని యాజమాన్యం తెలపటంతో చుట్టుప్రక్కల ప్రజలను అధికారులు ఖాలీ చేయిస్తున్నారు.


