TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైద‌రాబాద్‌లో 11మంది స‌జీవ ద‌హ‌నం.. విచార‌ణ‌కు ఆదేశం..

Published on: Wed Mar 23, 2022 11:11AM

భారీ అగ్ని ప్ర‌మాదంతో హైద‌రాబాద్ ఉలిక్కిప‌డింది. సికింద్రాబాద్ బోయ‌గూడ‌లో స్క్రాప్ గోడౌన్‌ త‌గ‌ల‌బ‌డింది. అందులో 15మంది బీహారీ కార్మికులు నిద్రిస్తున్నారు. మంట‌లు చెల‌రేగ‌డంతో.. 11 మంది అక్క‌డిక‌క్క‌డే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ఇద్ద‌రు మాత్రం సుర‌క్షితంగా మంట‌ల నుంచి త‌ప్పించుకున్నారు. మ‌రో ఇద్ద‌రి ఆచూకీ తెలీటం లేదు. 

బోయగూడలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్‌ కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

బోయగూడ ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో 15 మంది కార్మికులు మంగళవారం రాత్రి నిద్రించారు. షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. విష‌యం తెలిసి.. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ గోదాంలో కట్టెలతో పాటు వేగంగా మంటలు వ్యాపించే వస్తువులు ఉండ‌టం, హానిక‌ర పొగ వెలువ‌డ‌టంతో.. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మృతులంతా బిహార్‌లోని చాప్రా జిల్లా జక్కువు గ్రామానికి చెందినవారే. మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్ర‌మాదం గురించి తెలిసి.. హైద‌రాబాద్‌లో ఉన్న ప‌లువురు బిహారీ కార్మికులు మార్చురీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. మృతుల బంధువులు, స్నేహితులు కూడా ఇక్క‌డే ఉండ‌టంతో వారంతా బోరున విల‌పిస్తున్నారు. వాళ్లంతా చాలా ఏళ్లుగా హైద‌రాబాద్‌లోనే ప‌ని చేస్తున్నారు.

ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌.. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామని చెప్పారు.