TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజస్థాన్ సంక్షోభంలో సెన్సేషనల్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి పై ఎఫ్ ఐ ఆర్

Published on: Fri Jul 17, 2020 4:21PM

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభం సంచలన మలుపు తిరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇటీవల బయపటడ్డ ఆడియో టేపులపై తీవ్ర దుమారం చెలరేగింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల సంచలనానికి తెర తీశారు. తమ పార్టీ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఫోన్‌లో మాట్లాడుతూ బేరసారాలకు దిగారని తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయని తెలిపారు. ఈ ఆడియో టేపుల గురించి కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)కి ఫిర్యాదు చేయడంతో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కేసు నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్‌లో భన్వర్ లాల్, సంజయ్ జైన్‌తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లను చేర్చింది.

ఈ ఎఫ ఐ ఆర్ పై SOG ఏడీజీ అశోక్ రాథోడ్ మాట్లాడుతూ మహేష్ జోషి నుంచి మాకు రెండు ఫిర్యాదులు అందాయి. నిన్న వైరల్ అయిన ఆడియో టేపుపై ఆయన ఫిర్యాదు చేశారు. సెక్షన్ 124a, 120b కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఐతే ఆ ఆడియో టేప్ నిజమైనదా కాదా అనే విషయం పై దర్యాప్తు చేయాల్సి ఉంది అని తెలిపారు.

తన పై ఫైల్ అయిన ఎఫ్ ఐ ఆర్ గురించి కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని అయన తేల్చి చెప్పారు.