TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్థిక నేరగాడు లలిత్ మోడీపై చర్యలు అటకెక్కినట్లేనా?

Published on: Fri Jun 5, 2026 8:40PM

 

ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు లలిత్‌ మోడీ  తాజాగా భారత్ న్యాయ వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ ముఖ్య నేతలపై విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. లలిత్ మోడీ 2010లో భారత్ నుంచి లండన్ కి పరారయ్యారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కేటాయింపు బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్ సహా ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మోడీ సర్కారు ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. ఆ నేరస్తుల జాబితాలో లండన్‌ పరారైన లలిత్ మోడీ, విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి. 

అలాంటి లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాను పరారీలో ఉన్నానని అనడాన్ని తప్పు పడుతూ.. లండన్ నుంచి భారత్‌కు తిరిగి రావడానికి మాత్రం ససేమిరా అంటున్నారు.  భారత చట్టాలంటే భయం లేదని, అయితే భారతీయ న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని లాజిక్‌లు చెప్తున్నారు.  17 ఏళ్లుగా నన్ను కోర్టుకు తీసుకెళ్లలేదని, ఇప్పుడు ఎలా అరెస్టు చేయగలరని వితండ వాదం చేస్తున్నారు.

లండన్‌లో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ మాట్లాడుతూ.. తనను నిర్దోషిగా నిరూపించుకోవాలని అనుకున్నప్పుడే భారత్ వచ్చి కేసులు ఎదుర్కొంటానని ఆప్షన్‌లు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అలాగే  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరాన్ని లలిత్ మోడీ టార్గెట్ చేశారు. క్రికెట్ ఉన్న ఆదరణ కారణంగా తన పేరు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. 

ప్రజలను ప్రభావిత చేయడానికే ఎన్నికల సమయంలో, పార్లమెంటులో తన పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారత్ ప్రభుత్వానికి నిజంగా తనను పట్టుకోవాలని ఉంటే ఎప్పుడో పట్టుకునేదని, పరారీలో ఉన్నానని జరుగుతున్న ప్రచారం అంతా మీడియా సృష్టని లలిత్ మోడీ అంటుండటం.. తనను ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 17 ఏళ్లుగా యూకేలో నివస్తిస్తూ.. 2010లో తనపై అభియోగాలు మోపిన అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని పెద్దలు రాహుల్, చిదంబరంలపై లలిత్ మోడీ ఆరోపణలు చేస్తుండటం ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి? అన్న చర్చ మొదలైంది.