భ్రమలు లేని బడ్జెట్

 

ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రూ.17,77,477 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిలో ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు, ప్రణాళికా వ్యయం రూ.4,65,000 గా పేర్కొన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభూ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లాగే ఇది కూడా చాల సాదాసీదాగా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లుంది. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయంలో ఆచరణలో సాధ్యం కాని, లేదా చేసే ఉద్దేశ్యంలేని అనేక ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను బడ్జెట్ లో పేర్కొంటూ వాటికి భారీగా కేటాయింపులు జరుపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసేది. కానీ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అటువంటి మెరుపులేవీ లేకపోయినా కొన్ని కొత్త ఆలోచనలు ప్రస్పుటంగా కనిపించాయి.

 

ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల కంటే కార్పోరేట్ సంస్థలకు కొంచెం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది. కార్పోరేట్ సంస్థలకు ప్రస్తుతం ఉన్న30 శాతం పన్నును 25శాతానికి తగ్గించారు. సంపద పన్ను కూడా రద్దు చేసారు. ఇది పన్ను ఎగవేతలను అరికట్టేందుకేనని ఆర్ధికమంత్రి జైట్లీ చెప్పారు. కానీ విదేశాలలో నల్లదనం కూడబెట్టేవారిపట్ల, విదేశాల నుండి మనీ లాండరింగ్ పాల్పడే వారి పట్ల మరింత కటినంగా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఏడాదికి కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై 2 శాతం సర్ చార్జ్ విధించారు. ఉన్నత ఆదాయ వర్గాల వారికి ఇకపై సబ్సీడీ గ్యాస్ ఉండబోదు.

 

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపునిచ్చారు. అదేవిధంగా గంగా ప్రక్షాళనకు నిధులు అందించే వారికి పన్ను రాయితీ కల్పించారు. దేశంలో ఉండే కోట్లాదిమంది నిరుపేదలందరికీ జీవిత, ఆరోగ్య, ప్రమాద భీమాలు కల్పించాలనే మంచి ఆలోచనలు చేసారు. అయితే ఆదాయపన్ను పరిమితిని యధాతధంగా ఉంచడంతో మధ్యతరగతి ప్రజలు నిరాశ కలిగింది.

 

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు కొత్తగా సూపర్ సీనియర్ సిటిజన్లు అనే వర్గాన్ని జోడించారు. సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీని రూ.10 వేల నుంచి 30 వేలకు పెంచగా, సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లు పైబడిన వారికి రూ 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. వికలాంగులకు అదనంగా 20 వేల పన్ను రాయితీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రధానంగా దేశంలో మౌలికవసతుల కల్పన, ఉన్నత విద్య, వైద్య, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోంది. ఇక ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతూ వచ్చిన కేంద్రం అది ఇక ఏ మాత్రం సాధ్యంకాదని కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించింది. దానికి ప్రత్యామ్నాయంగా ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహార్ రాష్ట్రానికి కూడా ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని ప్రకటించారు.

 

బడ్జెట్ అనగానే కొన్ని టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు తదితర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులుంటాయని అందరూ ఎదురు చూడటం పరిపాటయిపోయింది. కానీ ఈసారి అటువంటి ప్రత్యేక వరాలేవీ కురిపించకుండానే, అలాగని వారికి కొత్తగా పన్నులేవీ వడ్డించకుండా సర్వో జనాః సుఖినో భవంతు అంటూ అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ముగించేశారు. ఈ బడ్జెట్ నేల విడిచి సాము చేయకుండా, ప్రజలకు ఎటువంటి అనవసర ఆశలు, భ్రమలు కల్పించకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడినట్లు కనబడుతోంది. కనుక దీర్ఘకాలంలో మంచి పలితాలు ఆశించవచ్చును.