నేడు హైదరాబాద్ రానున్న సినీనటి అంజలి
Published on: Fri Apr 12, 2013 8:29AM
.png)
సినీనటి అంజలి అదృశ్యం సంచలనాన్ని సృష్టిస్తున్న విషయం విదితమే. తాజాగా ఆమె తన సోదరుడు రవిశంకర్ ను శాటిలైట్ ఫోన్ ద్వారా తన క్షేమసమాచారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవిశంకర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన సోదరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని తెలపడంతో పోలీసులు అంజలిని తక్షణం హైదరాబాద్ రావాలని సూచించారు. రవిశంకర్ పోలీసుల సూచనలను అంజలికి చేరవేయడంతో అంజలి నేడు హైదరాబాద్ కు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ఒక సినీ నిర్మాత సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. పిన్నీ, బాబాయ్ లతో గత కొంతకాలంగా అంజలికి బేధాభిప్రాయాలు తలెత్తాయి. అంజలి తెలుగు చిత్రాలలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో బాబాయి, పిన్ని తమకు ఇష్టం లేదని, తమిళ సినిమాలలోనే చేయాలని ఆమెపై వత్తిడి తెచ్చారు. అయినా అంజలి వారి మాటలను బేఖాతరు చేయడంతో వారు అంజలిని కొట్టి హింసించినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విరక్తి చెందిన అంజలి హైదరాబాద్ లోని ఒక హోటల్ నుండి హఠాత్తుగా మాయమైపోయారు. ఆశ్రయమిస్తున్న సినీ నిర్మాత కూడా అంజలికి నచ్చజెప్పడంతో ఆమె ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి తాను ఎందుకు అదృశ్యం కావాల్సి వచ్చిందో వెల్లడిస్తుందని తెలిసింది.


