మోదీ చాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్ ఆవేదన.. ఇదెక్కడి న్యాయం

 

కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోసిన్.. ప్రధాని మోదీ భద్రతా సిబ్బంది ఎస్పీజీ అనుమతి తీసుకోకుండా హెలికాప్టర్ తనిఖీ చేశారని ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఊరట కలిగింది. మహమ్మద్ సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఈసీ.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఎన్నికల సంఘం తాజా ఆదేశాలపై మహమ్మద్ మోసిన్ స్పందించారు. ప్రధాని మోదీ హెలికాప్టర్ తనిఖీ చేయడం కూడా తన విధుల్లో భాగమని మరోసారి స్పష్టంచేశారు. 'నేను నా విధులు నిర్వర్తించాను, పనిచేసినందుకు పని నుంచి తప్పించారు. కానీ ఇంతవరకు నేను చేసిన తప్పుకు సంబంధించి పేజీ నివేదిక కూడా ఇవ్వలేదు. దీంతో నేను చీకటిలో నాతోనే పోరాడుతున్నా‘ అని అన్నారు.

వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేసేందుకు మోదీ హెలికాప్టర్ తనిఖీ చేశానని.. దీంతో మోదీ ప్రయాణానికి 15 నిమిషాల ఆలస్యమైందని అన్నారు. హెలికాప్టర్‌ ఫుటేజీ తీయమనడం తప్పా ? నిజాయితీగా డ్యూటీ చేస్తే విధుల నుంచి తప్పిస్తారా? అని మహమ్మద్ ప్రశ్నించారు. నీతిగా డ్యూటీ చేసిన తాను తప్పుచేయలేదని.. అందుకే ట్రిబ్యునల్ ను ఆశ్రయించానని స్పష్టంచేశారు. తన 22 ఏళ్ల సర్వీసులో నీతి, నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.. నియమ, నిబంధనలను అనుసరించి పనిచేస్తానని మహమ్మద్ అన్నారు.