భయం నిజమై తీరుతుంది


అదో చిన్న ఊరు. అందులో ఒకాయన సమోసాలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఉదయం అంతా సమోసాల కోసం కావల్సిన సామగ్రిని తయారుచేయడం. మధ్యాహ్నం నుంచి వేడివేడి సమోసాలు తయారుచేయడం. ఇదే అతనికి తెలిసిన పని. ఇలా చేసిన సమోసాలు... అలా చిటికెలో అమ్ముడుపోయేవి. ఆ సమోసాల కోసం ఊళ్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. పొరుగూరి నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ సమోసాల రుచి చూడకుండా వెళ్లేవారు కాదు. రోజురోజుకీ సమోసాల వ్యాపారం పెరుగుతోందే కానీ ఏ రోజూ తగ్గడం అంటూ ఉండేది కాదు. జోరు వానలో అయినా, మండు వేసవిలో అయినా... వేడి వేడి సమోసాలు ఇట్టే అమ్ముడుపోయేవి.

 


సమోసాల వ్యాపారికి ఒకే ఒక్క పిల్లవాడు ఉండేవాడు. తన వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో ఆ పిల్లవాడిని పట్నం పంపించి చదువు చెప్పించాడు. తను మాత్రం ఒంటరిగా ఆ పల్లెటూర్లో జీవితాన్ని గడిపేసేవాడు. ఉదయాన లేవడం దగ్గర నుంచీ, రాత్రికి పడుకోవడం దాకా అతని జీవితం అంతా సమోసాల చుట్టూనే తరిగేది. వార్తాపత్రికలు చదవడానికి కానీ, టీవీ చూడ్డానికి కానీ ఎలాంటి అవకాశమూ చిక్కేది కాదు.

 


అలా సమోసాల వ్యాపారం అంతకంతకూ పెరగసాగింది. చిన్న బండి కాస్తా ఓ దుకాణంగా మారింది. తనకు సాయంగా ఉండేందుకు మరో మనిషి ఉంటే బాగుండు అనిపించింది వ్యాపారికి. మరో పెద్ద దుకాణం కూడా తీసుకోవాలని తోచింది. తన ఆలోచనలన్నింటినీ కొడుకుతో పంచుకున్నాడు వ్యాపారి. వ్యాపారి మాటలు వింటూనే కొడుకు ఉద్రేకపడిపోయాడు...

 

 ‘అసలు ప్రపంచం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో నీకు తెలుసా! స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ముడిచమురు ధర కూడా పడిపోయింది. అమెరికాని నాశనం చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో అదనంగా పెట్టుబడి పెట్టడం అవివేకం. ఉన్న వ్యాపారంలోనే ఇంకా ఎక్కువ మిగుల్చుకోవడం ఎలాగా అని ఆలోచించు’ అని ఉపదేశం చేశాడు కొడుకు.

 


కొడుకు చెప్పిన మాటలు విన్న వ్యాపారి మనసులో భయం మొదలైంది. తన కొడుకు చదువకున్నవాడు, తెలివైనవాడు, అన్నీ తెలిసినవాడు.... అతను చేసిన సూచన నిజమే కాబోసని అనిపించింది. అంతే విస్తరణ సంగతి పక్కన పెట్టి, ఉన్న వ్యాపారంలో మరింత లాభం ఎలా సంపాదించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నాసిరకం ఉల్లిపాయలతో సమోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటే నూనెని పదే పదే వాడసాగాడు. సమోసాని కూరతో కాకుండా కారంతో నింపేశాడు. రేటు కూడా అమాంతంగా పెంచేశాడు.

 


వ్యాపారి ధోరణి మారిన కొద్దీ జనం కూడా పల్చబడసాగారు. సమోసాలు మిగిలిపోతున్నాయి. వాటిని మర్నాడు అమ్మే ప్రయత్నాలు కూడా మొదలవడంతో జనం అటువైపుగా రావడమే మానేశారు. చూస్తూచూస్తుండగా వ్యాపారం కాస్తా దివాళా తీసింది. ఈలోగా కొడుకు మళ్లీ పట్నం నుంచి వచ్చాడు. ‘నిజమేరా కొడకా! నువ్వు చెప్పినట్లు దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. సమోసాలు కొనడానికి కూడా జనం దగ్గర డబ్బు లేదు. దాంతో నా వ్యాపారం కూడా దివాళా తీసింది!’ అంటూ నిట్టూర్చాడు తండ్రి!!!
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) 

 

 

- నిర్జర.