ఇలా చేస్తే భయం కాస్తా పారిపోతుంది

ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...

 

భయాన్ని పసిగట్టండి

మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.

 

అలవాటు చేసుకోండి

ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.

 

భయపడే పని చేసేయండి

ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.

 

తాత్సారంతో లాభం లేదు

భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.

 

చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి

భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి.

- నిర్జర.