ప్రేమిస్తే చంపేస్తారా నాన్న?

తండ్రికి కూతురంటే ఇష్టం.. కాదు కాదు ప్రాణం.. అందుకేనేమో కొందరు క్షణికావేశంలో సొంత కూతురు ప్రాణాలే తీస్తున్నారు.. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి, తన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు.. కూతురు మీద తనకున్న ప్రేమని మర్చిపోయి, తన కూతురి ప్రాణాలే తీసేస్తున్నాడు.. కూతురు మీదున్న ప్రేమని మర్చిపోయి తండ్రి యముడిలా మారడానికి కారణం.. కూతురి ప్రేమ.. అవును ప్రేమే.. ప్రేమ పలకడానికి రెండు అక్షరాలే.. కానీ అదే ప్రేమ రెండు అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తుంది.

చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించిన నాన్న, ప్రేమిస్తే చంపేస్తాడని.. గుండెల మీద ఎత్తుకొని ఆడించిన నాన్న ప్రాణం తీస్తాడని..  ఏ కూతురు ఊహించదు.. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు.. కానీ తీస్తున్నాడు.. దానికి కారణం క్షణికావేశం.. అవును ఈ క్షణికావేశమే ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీసేలా చేస్తుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె చంద్రిక బీ.ఫార్మసీ చదువుతోంది.. పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామం వచ్చిన చంద్రిక, తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్తే.. ఆమె తన భర్త కోటేశ్వరరావుకి చెప్పింది.. కూతురు ప్రేమలో పడటం, ఎక్కువగా ప్రేమికుడితో ఫోన్ మాట్లాడుతుండటంతో.. కూతురు ప్రేమలో పడి తన పరువు తీస్తుంది అంటూ క్షణికావేశంలో కర్రతో బలంగా కొట్టడంతో చంద్రిక చనిపోయింది.. ఇప్పుడు కూతురు దూరమైందని బాధపడుతున్నాడు.. ఆవేశంలో కూతుర్ని దూరం చేసుకొని ఇప్పుడు కన్నీరు పెట్టుకొని ఏం లాభం.. కూతురు ప్రేమ గురించి తెలిసి ఆవేశం తెచ్చుకునే ముందు, ఒక్కసారి కూతురి మీద తనకున్న ప్రేమని గుర్తుతెచ్చుకుంటే ఎంత బాగుండేది.

ఇంత జరిగినా, కూతురికి నాన్నంటే ప్రాణం.. దానికి ఉదాహరణే చంద్రిక సోదరి శిరీష మాటలు.. 'మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క అంటేనే ఎక్కువ ప్రేమ.. క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది.. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ శిరీష కన్నీరు పెట్టుకుంది.. చంద్రిక, శిరీష లాంటి ప్రతి ఆడపిల్ల కోరిక ఒక్కటే.. 'కూతురు ప్రేమని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు.. కానీ కూతురి మీద ప్రేమని చంపుకొని, కూతురిని చంపి సమాజం దృష్టిలో చెడ్డవాడివి కాకు నాన్న'.