టోల్ గేట్ గోల్ మాల్..ఫాస్టాగ్ తో ఫసక్...

దేశవ్యాప్తంగా టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు రుసుము వసూలు. చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు ఈ రూల్. అందుకే, వాహనదారులంతా ఎగబడి మరీ ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్నారు. గతంలో మాదిరి టోల్ గేట్ల దగ్గర భారీ క్యూ లైన్లు లేవు. గంటల తరబడి ఎదురు చూపులు లేవు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోతోంది. అంతా ఫాస్టాగ్ ఎఫెక్ట్. 

ఫాస్టాగ్ తో వాహనదారులకు సౌకర్యంతో పాటు కేంద్రానికి రాబడీ భారీగా పెరిగింది. టోల్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తరువాత రోజుకు సరాసరి 20 కోట్లు వసూళ్లు పెరిగాయి. ఇది పెరిగిన అమౌంట్ మాత్రమే. అసలు మొత్తం ఇంకా ఎక్కువే. ఈ లెక్క ప్రకారం, ఫాస్టాగ్ లేకముందు ఈ 20 కోట్లు ఎవరికి వెళ్లాయనేది ఆసక్తికరం. 

గతంలో ఉన్న టోల్ గేట్ సిస్టమ్ పైసా వసూల్ కి కేంద్రం. అదో పెద్ద స్కాం. ఇన్నేళ్లూ టోల్ గేట్లతో వాహనదారుల తోలు తీశారు కాంట్రాక్టర్లు. పీపీపీ పద్దతిలో కాంట్రాక్ట్ సంస్థ సొంత నిధులను ఖర్చు చేసి రోడ్డు వేస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం వసూలు అయ్యే వరకూ టోల్ రూపంలో వాహనాదారుల నుంచి నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. రోడ్డు వేసేందుకు ఖర్చు చేసిన అమౌంట్ వసూలు అయ్యాక ఇక టోల్ బూతులు తీసేయాలి. ఇదీ పద్దతి. అయితే.. ఇక్కడే ఉంది తిరకాసంతా. అక్షయ పాత్రలా కాసులు రాల్చే టోల్ బిజినెస్ ను కాంట్రాక్ట్ కంపెనీలు అంత ఈజీగా వదులుకోవడం లేదు. నిబంధనల్లో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని కోట్లకు కోట్లు దండుకునేవి. ఎన్ని ఏళ్లు అయినా పెట్టిన సొమ్ము తిరిగి రానట్టు రికార్డులు చూపిస్తూ.. దశాబ్దాల తరబడి టోల్ వసూలు చేస్తూనే ఉండేవి. ఆ మేరకు బ్యాంకులను, కేంద్రాన్ని దగా చేసేవి కాంట్రాక్టు సంస్థలు. 

ప్రభుత్వం దగ్గర చాలినంత డబ్బులు లేక రోడ్లు వేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇస్తుంటుంది. ఎస్టిమేషన్ టైమ్ నుంచే చీటింగ్ మొదలై పోతుంది. వంద వాహనాలు నడిచే రోడ్డు మీద పది వెహికిల్సే నడుస్తుయాని ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ లెక్కన ఐదేళ్లలో వసూలయ్యే సొమ్ముకు 10-15 ఏళ్ల వరకూ టోల్ వసూలు చేసుకునేందుకు అనుమతి సాధిస్తారు. అందుకే, తరాలు మారినా కొన్ని టోల్ బూత్ ల్లో వసూళ్లు మాత్రం కొనసాగేవి.

అక్కడితో ఆగదు కాంట్రాక్ట్ సంస్థల అరాచకం. వచ్చిన వాహనాల లెక్కను.. మొదట్లో ఎస్టిమేట్ చేసిన సంఖ్య కంటే కూడా తక్కువగా చూపిస్తారు. తమ ఖర్చు ఇంకా వసూలు కాలేదని బుకాయించి మరో టోల్ గడువు మరో ఐదేళ్లు పెంచుకుంటాడు కాంట్రాక్టర్. టోల్ గేట్ లో వసూలైన డబ్బులనూ లెక్కల్లో చూపించరు. పది వాహనాల నుంచి వంద రూపాయలు వసూలైతే.. ఐదు వాహనాలు వెళ్లాయని 50 రూపాయలే వసూలయ్యాయని గోల్ మాల్ చేసేవారు. ఇలా డబ్బూ నొక్కేసేవారు. దాని మీద కట్టాల్సిన ట్యాక్సూ ఎగ్గొట్టేవారు. కేంద్రాన్ని నిలువునా ముంచేసేవారు. కొన్ని ఇన్ఫ్రా సంస్థలు మరింత దారుణంగా ప్రవర్తించేవి. తమ మార్గంలో టోల్ వసూళ్లు సరిగ్గా లేవని.. రోడ్డు వేయడం వల్ల కంపెనీ భారీగా నష్టపోయిందంటూ దివాళా ప్రకటించేవి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టకుండా ఎగ్గొట్టేవి. అవన్నీ నిరర్ధక ఆస్తులుగా మారి అటు బ్యాంకులూ రుణం ఇచ్చినందుకు ఆర్థికంగా దెబ్బతినేవి. ఇటు కేంద్రం, అటు బ్యాంకులను నిండా ముంచి.. అనధికారికంగా టోల్ వసూలు చేసి కాంట్రాక్ట్ సంస్థలు కోట్లు కొల్లగొట్టేవి. 

టోల్ వసూళ్లతో ఇన్ఫ్రా కంపెనీలు చేస్తున్న ఆగడాలకు ఫాస్టాగ్ తో చెక్ పడింది. ఆన్ లైన్ విధానంలో డబ్బులు ఆటోమెటిక్ గా కట్ అవుతుండటంతో.. లెక్క పక్కాగా మారింది. ఇప్పుడు వాహనాల సంఖ్యను తగ్గించి చూపించడానికి లేదు. వసూలైన సొమ్మును దాచేయడానికి లేదు. అంతా ఆటోమెటిక్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఫాస్ట్ ట్యాగ్ తో ఇన్నేళ్లూ దేశవ్యాప్తంగా సాగిన వేల కోట్ల టోల్ దోపిడీకి ముగింపు పలికింది కేంద్రం. ఫాస్ట్ ట్యాగ్ తో ప్రతీ పైసా లెక్కే. కాంట్రాక్టర్లకు చిక్కే. ఫాస్ట్ ట్యాగా మజాకా.