టోల్‌గేట్ వస్తే ఆగక్కర్లేదు..
Published on: Tue Jun 14, 2016 2:31PM

జాతీయ రహదారులపై 150 స్పీడుతో దూసుకెళ్తుండగా సడెన్‌గా టోల్‌గేట్లు వస్తుంటాయి. ఎంతో స్పీడుతో వచ్చి టోల్‌గేట్ దగ్గర బారులు తీరాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. సరేలే అని ముందుకు వెళితే మరోక టోల్‌గేట్ తారసపడుతుంది. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జాంలు, పెట్రోల్ దుర్వినియోగం , కాలుష్యం వంటి వాటితో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దానికి తోడు చాలా మంది వాహనదారులు టోల్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కోల్‌కతా ఐఐఎం, టీసీఐల అధ్యయనం ప్రకారం ఏడాదికి 21.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఎన్‌హెచ్ఏఐ కోల్పోతుందని అంచనా.
దీనిని గుర్తించిన భారత జాతీయ రహదారుల సంస్థ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ఫాస్టాగ్ అని పిలిచే ఈ విధానం ద్వారా వాహనాలేవైనా ఇక టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు సాంకేతిక విధానం ద్వారా పనిచేస్తుంది. దీనిని కలిగి ఉన్న వాహనాలు టోల్‌గేట్ మీదుగా వెళ్లగానే అక్కడ రుసుం ఎంత ఉందో ఆ మొత్తం ఫాస్టాగ్ ఖాతాలోంచి దానంతట అదే తీసుకుంటుంది. దీని వల్ల గేటు వద్ద ఆగకుండానే వాహనం వెళ్లిపోవచ్చు. ఈ విధానం ద్వారా సమయం, ఇంధనం రూపంలో చాలా డబ్బు ఆదా అవుతుంది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన టోల్ కేంద్రాల నుంచి ఈ ఫాస్టాగ్ ఖాతా తీసుకోవచ్చు. దానిలో రూ. 100 నుంచి రూ. లక్ష వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చెల్లింపులను డెబిట్/క్రెడిట్, చెక్కులు, నెట్ బ్యాంకింగ్, ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీసీ, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి ఢిల్లీ-ముంబయి, ముంబయి-చెన్నై మార్గాల్లో 48 టోల్ కేంద్రాల్లో ఫాస్టాగ్ లేన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్ తీసుకునేవారందరికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని కూడా ఇచ్చేందుకు ఎన్‌హెచ్ఏఐకి కేంద్రం అనుమతినిచ్చింది.


