మేకులు కొట్టిన చోటే మొక్కలు నాటిన రైతులు.. మోడీ సర్కార్ కు మరో పంచ్
Published on: Sat Feb 6, 2021 1:04PM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న పోరాటం ఇటు దేశంలోనే కాకుండా అటు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిన సంగతి తెల్సిందే. మరోపక్క ఇప్పటివరకు తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న మోడీ సర్కారు మొట్టమొదటిసారి ఈ వ్యవహారంలో మాత్రం విఫలమైందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా మొన్న రిపబ్లిక్ డే రోజున రైతు ర్యాలీ మాటున హింసాకాండ జరగడంతో కేంద్రం అప్రమత్తమై రహదారులను దిగ్బంధం చేయడం కోసం ఏకంగా ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని గాజీపుర్ వద్ద కేంద్ర బలగాలు.. పోలీసులు పెద్ద ఎత్తున రోడ్లకు మేకుల్ని దిగ్గొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు ర్యాలీ లో జరిగిన హింసతో రైతులకు ఎటువంటి సంబంధం లేదని ఇదంతా కొన్ని అరాచక శక్తుల కుట్ర అని రైతు ఉద్యమ నాయకులు స్పష్టం చేసారు.
జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద మేకుల పక్కనే.. రైతులు తాజాగా మొక్కల్ని నాటి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల పక్కనే పూల మొక్కల్ని నాటేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరోపక్క రోడ్డు పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. దీని కోసం సమీపంలోని నర్సరీల నుంచి పూలమొక్కల్ని తెస్తున్న రైతులు.. వాటిని నాటుతున్నారు. ఉద్యమం చేస్తున్న రైతులు కొత్త కొత్త ఆలోచనలతో మోడీ సర్కార్ కు తమదైన పద్దతిలో జవాబివ్వడాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.


