రైతులను అడ్డుకుంటున్న పోలీసులు! ఢిల్లీ బార్డర్ లో హై టెన్షన్! 

రైతుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని వస్తుండగా... వారిని అడ్డుకునేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

 

రైతుల నిరసనలతో రెండు రోజుల పాటు పంజాబ్‌కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. దీంతో వారిని అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.