రైతులకు టోపీ పెడుతున్న ఐకెపి, రైస్ మిల్లర్లు
Published on: Mon Feb 27, 2012 1:38PM
హైద
రాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇందిరాక్రాంతిపధం సిబ్బంది, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని రైతులు సరఫరా చేస్తున్న ధాన్యం నుంచి పెద్ద మొత్తంలో తరుగు తీసేస్తున్నారు. ఇదేమని రైతులు అడిగితే ఈ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయరంటూ రైతులను భయపెడుతున్నారు. ఈ కుమ్మక్కు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. ధాన్యం పండించే రైతులకు మద్దతు ధర అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ రైతులకు మద్దతు ధర అందినా తరుగు పేరుతో తీవ్రనష్టం జరుగుతుంది. అంతా సవ్యంగానే ఉన్నట్లు ఒకవైపు అధికారులు చెబుతున్నా, మరోవైపు గుట్టుగా తరుగు తీయడంతో రైతులు నష్టపోతున్నారు. ఐకెపి సిబ్బంది మాత్రం ఒక్కో సెంటర్ కు కేవలం 10 క్వింటాళ్ళు తరుగు తీసినట్లుగా రికార్డుల్లో చూపుతున్నారు. కానీ రికార్డుల్లో నమోదు చేయకుండా తమ మాయాజాలంతో ఒక్కో సెంటర్ లో సుమారు 100 క్వింటాళ్ళ వరకు తరుగు తీస్తున్నట్లు తెలిసింది. 17శాతం లోపు తేమ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని ఐకెపి అధికారులు నిబంధన పెట్టారు. వ్యవసాయ శాఖ టెక్నికల్ సిబ్బంది తేమను నిర్ధారించిన తరువాత వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. రైతు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేసి వారికి నమోదు బిల్లులు కూడా ఇస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఈ ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకు వచ్చిన తరువాత సిబ్బంది తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందట, మిల్లర్లు రిజెక్టు చేస్తున్నారు. తరుగు తీస్తే తీసుకుటామంటున్నారు. ఏం చేద్దాం అంటూ ఐకెపి సిబ్బందినుంచి రైతులకు సమాచారం వస్తోంది. దీంతో అసలు కొనుగోలు చేయరేమోనని భయంతో రైతులు ఎంత కావాలంటే అంత తరుగు తీయమని చెబుతున్నారు. దీంతో మిల్లర్లు, ఐకెపి సిబ్బంది కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు.


