TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతు సమస్యలపై సభలో వాడివేడి చర్చ

Published on: Tue Feb 28, 2012 11:09AM

హైదరాబాద్: రైతు సమస్యలపై మంగళవారం సభలో వాడివేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదనీ, రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటించినా గుడ్లప్పగించి చూస్తూ కూచుందే తప్ప రైతులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందీ.. నిద్ర పోతుందా అని ప్రశ్నించారు. పంట విరామం ప్రకటించిన రైతులను తక్షణం ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కూడా పెంచాలని కోరారు. ఎరువుల ధరలు భారీగా పెంచారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడిగినా ఎందుకు తగ్గించలేదన్నారు. బియ్యంపై వెంటనే ఆంక్షలు ఎత్తి వేయాలన్నారు.


కాగా, ప్రతిపక్షాలు బియ్యం ఎగుమతిపై ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... అందరూ కోరితే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసేందుకు సిద్ధమని కానీ ఆ తర్వాత బియ్యం ధరలు పెరిగితే తమను అడగవద్దని ఆయన విపక్షాలకు సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ధాన్యం తరలింపుపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 95 లక్షల మందికి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు.  ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం సభ నుండి వాకౌట్ చేశాయి. ఆంక్షలను వ్యతిరేకిస్తూ గ్రామస్థాయి నుండి ఉద్యమం నిర్మిస్తామని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.